‘నవయుగ’కు అనుకూలంగా న్యాయస్థానం ఉత్తర్వులు
విజయవాడ: పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణసంస్థ ‘నవయుగ’కు దక్కిన టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీచేసిన ప్రిక్లోజర్ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. టెండర్ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఇది కేవలం పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు కేసులో ఒప్పందం రద్దు ఉత్తర్వుల అమలుకు సంబంధించిన తీర్పు. ప్రాజెక్టు పనులను థర్డ్ పార్టీకి కేటాయించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రివర్స్ టెండరింగ్ తక్షణం నిలుపుదల చేయాలని హైకోర్టు పేర్కొంది. జల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఇది కేవలం హైడెల్ ప్రాజెక్టు విషయంలో తీర్పు. దీనికి పోలవరం హెడ్ వర్క్స్ పనులకు ఎటువంటి సంబంధం లేదు.