మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
విజయవాడ : పోలవరం ప్రాజెక్టుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరాన్ని కేంద్రానికి అప్పగించే యోచన లేదని తేల్చిచెప్పారు. పోలవరం రీటెండరింగ్ ద్వారానే ప్రాజెక్టు పనులు కొనసాగిస్తామని అన్నారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. వచ్చే నెలలో పోలవరంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ పర్యటన ఉంటుందని తెలిపారు. గజేంద్ర షెకావత్.. పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రాజెక్టు చేపడతామని, రూ.60 వేల కోట్ల అంచనాతో సెప్టెంబర్‌లో టెండర్లు పిలుస్తామన్నారు. రూ.30 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రాన్ని కోరామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.