ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ పోలవరం పనులు సాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ.. ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు. తాజాగా ఇసుక లేక హెడ్ వర్క్స్ పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థకు ఇసుక కాంట్రాక్ట్ సంస్థకు మధ్య చెలరేగిన వివాదమే ఇందుకు కారణం.
విచిత్రం ఏంటంటే.. మంగళవారం పోలవరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కానీ.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల కారణంగా చాలా ఆలస్యం అవుతోందని ఆరోపించారు. అనుకున్న సమయానికి పూర్తి చేసి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అంకితం చేస్తామని ప్రకటించారు. అయితే.. జగన్ అలా ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఇసుక కొరతతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను జేపీ కంపెనీకి అప్పగించింది ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణానికి ఇసుకను వాడుకోవడానికి అన్ని అనుమతులు ఉన్నా.. గోదావరి నుండి తీసుకెళ్లేందుకు వీలు లేదని నిర్మాణ సంస్థకు స్పష్టం చేసింది. ఇసుక తవ్వుకునేందుకు డబ్బు కట్టాల్సిందేనని చెప్పింది. తమకు అనుమతులు ఉన్నాయని పోలవరం నిర్మాణ సంస్థ చెప్పినా ఇసుక సరఫరా చేసేది లేదని జెపీ వెంచర్స్ తేల్చి చెప్పింది.
ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి. దాదాపు 250 టిప్పర్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అధికారులను సైతం జేపీ కంపెనీ లెక్కచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.