విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సకాలానికి పూర్తవుతుందా..? రివర్స్ టెండరింగ్‌పై కేంద్రం సీరియస్ అయిన దరిమిలా వ్యవహారం వివాదాస్పదం కావడంతో జనంలో ఈ కొత్త సందేహం ముప్పిరిగొంటోంది.
ప్రాజెక్ట్ నిర్మాణంలో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన నవయుగ సంస్థను తప్పించి ఇంకా తక్కువ వ్యయంతో పనులు జరిపించడానికి జగన్ సర్కార్ ‘రివర్స్ టెండర్’ విధానం చేపట్టడానికి పూనుకుంది. పోలవరం పనుల్లో అవినీతిని అరికట్టడానికి, వ్యయం తగ్గించడానికి ‘రివర్స్ టెండర్’ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఐతే, రాష్ట్ర ప్రభుత్వ వాదనతో కేంద్రం ఏకీభవించడం లేదు. రివర్స్ టెండరింగ్‌పై సీరియస్ అవుతున్నట్టు కనిపిస్తోంది. కేంద్ర జలవనరుల శాఖ జోక్యం చేసుకుని ఈ రివర్స్ టెండరింగ్ అంశంపై నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరింది.
రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడంతోపాటు, వ్యయం కూడా పెరుగుతుందని అటు కేంద్ర మంత్రి, ఇటు అథారిటీ చెప్పినా.. ఏపీ ప్రభుత్వం పాత కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవడానికి దారి తీసిన కారణాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆదేశాల ప్రకారం జల వనరుల శాఖకు దీనిపై తగిన సూచనలు చేసినట్టు సమాచారం. కేంద్ర మంత్రి నుంచి వచ్చిన వర్తమానం మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రస్తుతం దీనిపై కూలంకుశంగా ఒక నివేదిక అందించే పనిలో నిమగ్నమైంది. వారంరోజుల గడువులోగా దాన్ని కేంద్రమంత్రికి అందించనుంది. ఇప్పటివరకు పోలవరం నిర్మాణం సాగిన తీరు, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నుంచి అందులో వచ్చిన మార్పులు, టెండర్ రద్దు వల్ల ఎదురయ్యే సమస్యలు.. ఇలా అన్నింటినీ ఈ నివేదికలో పొందుపరచి సమర్పిస్తారు. ఇందులో సొంత అభిప్రాయాలు జోడించబోమని, ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను మాత్రమే పొందుపరుస్తామని పీపీఏ అధికారులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం లోక్‌సభలో ప్రాజెక్టుల రక్షణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. పోలవరం రివర్స్ టెండర్లు ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధంగా మారతాయని అభ్యంతరం తెలిపారు. దాని వల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, అసలు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని తెలిపారు. తర్వాత మరో సందర్భంలో రివర్స్ టెండరింగ్‌పై గజేంద్రసింగ్ మళ్లీ స్పందించారు. ‘అన్నీ గమనిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం’ అని కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వ చర్యలపై స్పందించారు. దరిమిలా రీటెండర్ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఈనెల 16న పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మరుసటిరోజే కొత్త టెండర్లను పిలుస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరిణామాల తరువాత కేంద్ర జలవనరుల శాఖ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక కోరినట్లు సమాచారం.
రివర్స్ టెండర్ వ్యవహారంపై పీపీఎను నివేదిక కోరిన కేంద్రం తక్షణ చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నివేదిక అందగానే రివర్స్ టెండర్ సీన్ రివర్స్ చేయవచ్చని తెలుస్తోంది. మరోవైపు నవయుగ సంస్థ హై కోర్టులో వేసిన పిటిషన్ కోర్టులో విచారణలో ఉంది.
ఓవరాల్‌గా రివర్స్ టెండరింగ్ ఇష్యూ ప్రస్తుతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రం రివర్స్ వ్యవహారంపై ఈ నిర్ణయం తీసుకుంటుంది..? కోర్టు నిర్ణయం ‘నవయుగ’కు సానుకూలంగా ఉంటుందా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. పోలవరం పనులు సకాలానికి సక్రమంగా పూర్తవుతాయా.? జాప్యం జరుగుతుందా… అనేది ప్రస్తుతానికి శ్నార్థకంగా మారింది.