హవాలా డబ్బు తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన దోపిడీ గ్యాంగ్ ను అనంతపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ నుండి బెంగళూరు తరలిస్తుండగా అనంతపూర్ జిల్లా వద్ద హైవే పై సోదాలు నిర్వహించిన పోలీసులు నలుగురు కేరళ వ్యక్తులను అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. హవాలా డబ్బు తరలింపు కోసం ఉపయోగించిన వాహనాన్ని కూడా సీజ్ చేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడు హైవేపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే ఓ వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో డబ్బులు కుప్పలుగా ఉండటం చూసి వాహనంలో ఉన్న వారిని ప్రశ్నించడంతో వారు సమాధానం చేప్పేందుకు తడబడ్డారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు డబ్బుపై సరైన ఆధారాలు చూపించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది.
ఆరాతీసిన పోలీసులకు వారు కేరళకు చెందిన గ్యాంగ్ గా గుర్తించగా.. వారి వద్దనుంచి మొత్తం రూ.1.89 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీధరన్ నేతృత్వంలో హవాలా డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించారు.
పట్టుకున్న నిందితులను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో ఇలా ఎన్నిసార్లు డబ్బు తరలించారని అనే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో ఎవరైనా కుమ్మక్కై డబ్బును తరలిస్తున్నారా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో వీరితో గల సంబంధాలను కూడా పోలీసులు అన్వేషిస్తున్నారు.