సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని నిమ్జ్ లో తొలి పరిశ్రమ వెమ్ ప్రాజెక్టును రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. అయితే భూనిర్వాసితులు, భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మామిడిగి, ఎల్గోయి, బర్దిపూర్, మెటలకుంట భూ నిర్వాసితులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ ప్రైవేటు రక్షణరంగ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు కేటీఆర్ రావడాన్ని వ్యతిరేకిస్తూ భూ నిర్వాసితులు ప్లకార్డులు ప్రదర్శించారు. నిమ్జ్ పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు.
నిమ్జ్ ప్రాజెక్టులో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో 550 ఎకరాలలో వేమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి భూమిపూజ జరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా ఎల్గోయి, బర్దిపూర్, చిలిపల్లి, న్యాల్ కాల్ మండలంలోని ముంగి, ముంగి తాండా, హద్నుర్, రేజింటల్, మొల్కలపడు, మిర్జాపూర్, (న్)మల్కాపూర్, గుంజాటి, రుక్మాపూర్ తాండ, రామతీర్థం తదితర గ్రామాలను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు, ఎక్కడికక్కడ రైతులను అరెస్టు చేసి ఝరాసంగం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరోవైపు ఆయా గ్రామాలలో హోటళ్లను, కిరాణం షాపులను, సైతం పోలీసులు బంద్ చేయించారు. జహీరాబాద్ నుండి మచున్నూర్, బర్దిపూర్ క్రాస్ రోడ్డు నుండి నిమ్జ్ వరకు అడుగడుగునా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైతులను సైతం పొలాలకు వెళ్లనివ్వడం లేదు. గంగ్వార్ వద్ద నిరసనకు దిగిన రైతులు, గ్రామస్తులపై లాఠీ చార్జీ చేశారు