టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల లోని సాంఘీక సంక్షేమ హాస్టల్ విద్యార్ధిణులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు విద్యార్థినిల పై లైంగిక వేదింపులకు పాల్పడిన దేవయ్యను ఆయనకు సహకరించిన మెస్ వర్కర్ విజయ లపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దేవయ్యను అరెస్ట్ చేశామని…దేవయ్యకు సహకరించిన మెస్ వర్కర్ విజయ పరారీలో ఉందని…ఆమె కోసం మూడు పోలీస్ బృందాలు గాలిస్తున్నట్టు జిల్లా ఎస్.పి రాహుల్ హెగ్డే తెలిపారు. బాలికలు, మహిళల పై లైంగిక వేదింపులకు పాల్పడితే కఠినముగా వ్యవహరిస్తామని యస్.పి. రాహుల్ హెగ్డే హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలకు సంబందించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని యస్.పి. తెలిపారు.
సిరిసిల్లలోని సాంఘీక సంక్షేమ హాస్టల్ లో విద్యార్ధినులపై మంత్రి కేటీఆర్ అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఇటీవల ఓ సోషల్ మీడియాలో వార్త ప్రసారమైంది. తమను ఏ విధంగా వేధిస్తున్నారో బాధిత విద్యార్ధులు స్వయంగా వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరలయ్యింది. స్వయాన ముఖ్యమంత్రి కుమారుడు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నియోజకర్గంలో ఆయన అనుచరులే బాలికలపై లైంగిక వేధింపులు జరగడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.