గత పర్యటనల దృష్ట్యా ప్రతిపక్షాలను 24 గంటల ముందే అరెస్ట్ చేసినా మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తప్పలేదు. మంగళవారం కరీంనగర్ సర్క్యూట్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ వెళ్తున్న క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలో దిగి నిరసనకారులను లాగిపడేశారు.
ముందు బీఆర్ఎస్ జెండాలు పట్టుకుని వచ్చిన ఆందోళనకారులు కేటీఆర్ కాన్వాయ్ దగ్గరకు రాగానే కాషాయ జెండాలను బయటకు తీశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తల పట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా దురుసుగా ప్రవర్తించారు.
నిరసనకారులను సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ కాలితో తన్నడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
విద్యారంగ సమస్యలు, హాస్టల్స్, గురుకులాల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. అలాగే, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ నిధులు విడుదల చేయాలన్నారు. విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని నినదించారు.