జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోని చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కర్ణాటకలోని బీదర్ లో ఈ దొంగలను పట్టుకున్నారు. దొంగల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగల లొకేషన్ ను కనిపెట్టారు పోలీసులు. దొంగిలించిన సొమ్ములో 60 శాతం రికవరీ చేసినట్లు తెలుస్తోంది. కొండగట్టు ఆలయ చరిత్రలో చోరీ జరగడం ఇదే తొలిసారి.
కాగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. అలాంటి అంజన్న ఆలయంలో దొంగతనం జరగడం తీవ్ర కలకలం రేపింది. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు బీభత్సం సృష్టించారు. ముఖానికి మాస్క్ వేసుకుని చేతిలో దొంగలించిన గుడి వస్తువులను తీసుకుని వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
రెండు కిలోల స్వామి వారి మకరతోరణం, అర్థమండపంలో వెండి మకర తోరణం, 3 కిలోల శఠగోపాలు ఎత్తుకెళ్లారు. మొత్తం 15 కిలోల వరకు ఆభరణాలు ఎత్తుకెళ్లారు దుండగులు. వీటి విలువు సుమారు రూ.9 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.
గురువారం రాత్రి స్వామి వారి పవళింపు సేవ అనంతరం గుడి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు. శుక్రవారం వేకువ జామున ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ చేసేందుకు గుడికి వెళ్లిన అర్చకులు దొంగతనం జరిగినట్లు గుర్తించి షాక్ అయ్యారు.