సీఎం సార్ చెప్పమన్నారు అంటూ… ప్రగతిభవన్ లో పనిచేసే అవినీతి అధికారి గటిక విజయ్ కుమార్ ఇష్యూ బయటకు రాగా, నేను కేటీఆర్ పీఏ అంటూ పలు కార్పోరేట్ కంపెనీలను మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ అరెస్టు చేసింది. అలా పీఏనని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా….? మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు.
మంత్రి కేటీఆర్ పీఏనంటూ నాగరాజు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలతో పాటు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లను బెదిరించి లక్షల రూపాయలకు నాగరాజు మోసం చేశాడు. నాగరాజును అరెస్టు చేసిన పోలీసులు… అతని నుండి పది లక్షల రూపాయల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది ఫిబ్రవరిలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటూ నాగరాజు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిది కార్పోరేట్ కంపెనీలను మోసం చేశాడు. బంజారాహిల్స్, ఓయూ, సనత్‌నగర్, మాదాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లతో పాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరులలోనూ నాగరాజుపై పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. నాగరాజుపై పీడీ యాక్ట్ కూడా నమోదు అయ్యింది. 2018 నుండి అతడిపై కేసులు ఉన్నాయి.