గ్రూపు 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు బీఎస్పీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తెలంగాణలో గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన హైదరాబాద్ కార్యాలయంలో దీక్షకు దిగారు. ప్రిలిమ్స్ పరీక్షను 48 గంటల్లో రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆయన మంగళవారం గడువు ఇచ్చారు. ఆ గడువు ముగియడంతో ఆయన ఈ రోజు నిరవధిక దీక్షకు దిగారు.
ఆయన్ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఎస్పీ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని తాము తమ పార్టీ కార్యాలయంలో శాంతి యుతంగా దీక్ష చేస్తున్నామన్నారు.
తమ దీక్షను పోలీసుల ద్వారా బలవంతంగా భగ్నం చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా తాము నిరవదిక దీక్షను కొనసాగిస్తామని అన్నారు. గ్రూప్-1తో పాటు ఏయే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయో వాటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీపై అభ్యర్థులకు విశ్వాసం పోయిందని ఆయన అన్నారు. వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి పదవి నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. అప్పటి వరకు తమ దీక్ష కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు.