లారీ డ్రైవర్ పై కాల్పుల ఘటనను ఛేదించారు రాచకొండ పోలీసులు. ఈ కేసులో దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఈనెల 17న పహాడీ షరీఫ్ పరిధిలో లారీ డ్రైవర్ పై కాల్పులు జరిపారు దుండగులు. రూ.44 లక్షల విలువైన టైర్లతో పాటు లారీని ఎత్తుకెళ్లారు.
డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు.. నిందితులను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమించారు. దీనికి సంబంధించిన వివరాల్ని సీపీ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. హర్యానాకు చెందిన గ్యాంగ్ తమిళనాడు నుండి వస్తున్న లారీని లిఫ్ట్ పేరుతో ఆపారని.. తర్వాత డ్రైవర్, క్లీనర్ చేతులు కట్టేసి క్యాబిన్ లో పడేశారని చెప్పారు.
లారీ ఎక్కగానే డ్రైవర్ పై దాడి చేసి.. తుపాకీతో బెదిరించారని వివరించారు సీపీ. తర్వాత లారీని కాటేదాన్ కు తీసుకొచ్చారని అక్కడ ఓ గోదాంలో టైర్లు దింపారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించామని.. టవర్ లోకేషన్, సీడీఆర్ ఆధారంగా అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జంషెద్ ఖాన్ అలియాస్ జమ్మి విమానంలో వెళ్ళిపోయాడని.. వెంటనే ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సహాయంతో ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జంషెద్ తోపాటు రహిల్ ఖాన్ దోపిడీకి పాల్పడ్డాడని ఓ రౌండ్ కాల్పులు జరిపారని వివరించారు.
Advertisements
తుపాకీ ఉంటే విమానంలో వెళ్లడం కష్టమని దాన్ని రహిల్ కు అప్పగించి జంషెద్ వెళ్లాడని తెలిపారు సీపీ. హైదరాబాద్ కి చెందిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, కమల్ కబ్రా సాయంతో గోదాంకి టైర్లను తరలించారని చెప్పారు. ఈ గ్యాంగ్ లో నలుగురిని అరెస్ట్ చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ఇదే ముఠా జనవరి 18న 220 టైర్లతో వెళ్తున్న లారీని ఇలాగే దోపిడీ చేశారని.. దీనిపై ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని చెప్పారు. తమిళనాడు, హర్యానాకు టీమ్స్ పంపించి విచారణ చేస్తామన్నారు మహేష్ భగవత్.