ఇటీవల కాలంలో జిమ్ కు వెళ్లే వారు ఎక్కువైపోయారు. ఆఫీసులో ఒత్తిడి, బిజీ లైఫ్ లో శారీరక శ్రమ చేసే టైమ్ ఉండదు కాబట్టి.. చాలామంది యూత్ జిమ్ లకు వెళ్లి వర్కౌట్లు చేస్తున్నారు. ఫిట్ నెస్ కోసం జిమ్ లలో గంటలకొద్దీ కష్టపడుతూ ఉంటారు. కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఫిట్ నెస్ కోసం మరింత సమయం జిమ్ లోనే గడుపుతారు. అయితే జిమ్ లో చెమటలు కక్కేలా రోజూ వర్కౌట్లు చేసే ఓపిక చాలామంది యువతకు ఉండటం లేదు. వీరి వీక్ నెస్ ను ఆసరా చేసుకుని కొంతమంది ముఠా డబ్బులు సొమ్ము చేసుకుంటుంది. స్టెరాయిడ్స్ విక్రయిస్తూ యువత నుంచి డబ్బులు గుంజుకుంటుంది. తాజాగా హయత్ నగర్ లో ఈ విషయం బయటపడింది.
హయత్ నగర్ లోని బాలాజీ, ప్రసాద్ అనే వ్యక్తులు జిమ్ కు వెళ్లే వాళ్లను టార్గెట్ చేశారు. స్టెరాయిడ్స్ తీసుకుంటే పెద్దగా కష్టపడకుండా.. కండలు సాధించవచ్చు అంటూ యువతను నమ్మించేవారు. అలా చాలా మంది వీరివద్ద స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. అయితే అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఈ ముఠాలపై నిఘ పెట్టారు. అనంతరం దాడులు చేసి స్టెరాయిడ్స్ అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
అలాగే అనేస్తటిక్, హార్మోన్స్ ఇంజక్షన్లు కూడా గుట్టుగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 30 ఇంజక్షన్స్, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రిస్కెప్షన్ ద్వారా అయితే ఈ మందులు రూ.268 కాగా వీరు రూ.1000 నుంచి రూ.2 వేల వరకూ విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాలాజీ హయత్ నగర్ లోని మక్సిక్యూర్ లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రసాద్ శ్రీనివాస్ హాస్పిటల్ లో కంపౌండర్ గా పని చేస్తున్నట్లు వివరించారు పోలీసులు.
తాజాగా ఈ విషయంపై మాక్సిక్యూర్ హాస్పిటల్ మేనేజర్ రంగ నాయక్ రియాక్ట్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రిస్కిప్షన్ లేకుండా మా హాస్పిటల్ నుండి ఒక్క మెడిసన్ కూడా బయటకు వెళ్లదని క్లారిటీ ఇచ్చారు. అలాంటిది స్టెరాయిడ్స్ ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. మా ఆస్పత్రికి, స్టెరాయిడ్స్ ఇల్లీగల్ ఇంజెక్షన్లకీ సంబంధం లేదని తెలిపారు. కావాలనే కొందరు మా హాస్పిటల్ నేమ్ బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై మేము కూడా పోలీస్ కంప్లైట్ చేసినట్లు తెలిపారు.