హైదరాబాద్ బేగంబజార్ పరువు హత్య కేసులో మొత్తం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం కర్నాటక పారిపోయిన నిందితులను టాస్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఈ కేసులో అరెస్టు అయిన మొత్తం నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరిందని పోలీసులు తెలిపారు.
బేగంబజార్‌లోని షా ఇనాయత్ గంజ్ పీఎస్ పరిధిలో మచ్చి మార్కెట్‌లో రెండు బైక్‌లపై వచ్చిన నిందితులు..నీరజ్ పన్వర్ ను దారుణంగా హత్య చేశారు. 20 కత్తి పోట్లు పొడిచారు. దాంతో తీవ్రంగా గాయపడిన నీరజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
నీరజ్ భార్య సంజన సోదరులు ఈ హత్యకు ప్లాన్ చేశారు. ప్రేమ వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకునే ఈ హత్య చేశారు. సంజనను ఆమె కుటుంబ సభ్యులు బేగం బజార్ కు రావొద్దని హెచ్చరించినప్పటికీ నీరజ్ బేగం బజార్ ఏరియాలో తిరిగారు.
ఈ క్రమంలోనే ఈ హత్య జరిగింది. అలా సరూర్ నగర్ పరువు హత్య మరవక ముందే మళ్లీ బేగం బజార్ లో ఈ హత్య చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేశారు. నిందితులు అభినదన్, వంశ్, సంజయ్, హల్లె, ప్రశాంత్‌తో పాటు ఇద్దరు మైనర్‌లను అరెస్ట్ చేశారు.