సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ యువకులు బీభత్సం సృష్టించారు. రైళ్లకు నిప్పు పెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఈ విధ్వంసానికి ఎన్ఎస్ యూఐ కారణమని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు వెంకట్. అగ్నిపత్ పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని చెప్పారు. ఆ విద్యార్థులు ఆవేశానికిలోనై ఈ ఘటనకు పాల్పడడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనకు ఎన్ఎస్ యూఐకి ఎలాంటి సంబంధం లేదని.. ఆ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
అల్లర్ల నేపథ్యంలో వెంకట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దానిపై స్పందించిన ఆయన..‘‘నేను ఉదయం ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి వెళుతుండగా పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తరువాత షా ఇనాయత్ గంజ్ పీఎస్ కు తీసుకెళ్లారు’’ అని తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆందోళనకారులు రైలు బోగీలకు నిప్పు పెట్టారు. స్టేషన్ బయట ఆర్టీసీ బస్సులపై దాడులకు పాల్పడ్డారు. తెల్లవారుజామునే భారీగా స్టేషన్ దగ్గరకు చేరుకున్న యువకులు.. అగ్నిపథ్ ను రద్దు చేయాలంటూ గళమెత్తారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ కు నిప్పు పెట్టారు. దీంతో స్టేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీఛార్జ్ కూడా చేశారు. పలువురికి గాయాలయ్యాయి.