వరంగల్ ల్యాండ్ పూలింగ్ జీఓను రద్దు చేయాలని అరెపల్లి రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలోనే ఆలయంలో గ్రామసభ నిర్వహించగా.. తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. అయితే.. ఆయన్ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
అరెపల్లి గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాజీపేట, పరకాల ఏసీపీలు, నలుగురు సీఐలు పహారా కాస్తున్నారు. అయితే.. బైక్ పై అరెపల్లికి చేరుకున్న మల్లన్న రైతులను కలిశారు.
ప్రభుత్వం తెచ్చిన జీఓ 80A ను ప్రభుత్వమే రద్దు చేసే వరకు పోరాటం సాగించాలని రైతులకు సూచించారు మల్లన్న. దానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే.. మల్లన్నను అరెస్ట్ చేయడానికి పోచమ్మ దేవాలయంలోకి బూట్లతో పోలీసులు రావడంతో ప్రజలు, రైతులు తిరగబడ్డారు.
పోలీసుల చర్యతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. మల్లన్న అరెస్ట్ సమయంలో.. గో బ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేశారు.