ఉదయం లేచిన దగ్గర నుంచి మనం వాడే ప్రతి వస్తువు కల్తీదే. దీంతో కొన్ని సందర్భాల్లో బయట ఏది కొనాలన్నా భయం వేస్తుంది. ముఖ్యంగా నిత్యావసరాలు పాలు, నూనె, కూరగాయలు కల్తీ అవుతున్నాయి. ముఖ్యంగా మనం రోజు ఉదయన్నే తాగే పాలు, టీ కల్తీ అవుతున్నాయి. పాలల్లో నీళ్లు కలిపితే ఏం కాదు కానీ.. కెమికల్స్ కలుతన్నారు. ఈ కెమికల్స్ కలిపిన పాలు తాగితే క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడం ఖాయం.
తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు తయారు చేస్తున్న ముగ్గురు వ్యాపారులను ఫుడ్‌సేఫ్టీ అధికారులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. వీరు పాలను సేకరించి, అవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు హానికరమైన రసాయనాలను కలిపి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. శవాలను భద్రపరచడానికి వాడే కెమికల్ను పాలలో కలుపుతున్నట్లు గుర్తించారు.
శవాలను భద్రపరచడానికి వాడే ఫార్మాల్డిహైడ్ కెమికల్ను పాలల్లో ఉపయోగిస్తున్నట్లు తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా పగిలిపోకుండా ఉండేందుకు ఫార్మాల్డిహైడ్ రసాయనాన్ని వాడుతున్నట్లు నిర్వహకులు ఒప్పుకున్నారు. పాలల్లో నీళ్లతో పాటు సుక్రోజ్, అమ్మోనియం సల్ఫేట్ కలిపి హైదరాబాద్లోని హోటల్స్కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఫార్మాల్డిహైడ్ కెమికల్ పాలలో కలపడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని వైద్యులు తెలిపారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలపై తీవ్ర భావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్తీ చేస్తున్న వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం వారికి జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.