నల్గొండ జిల్లా మర్రి గూడ మండలం దామర భీమన పల్లి లోని ఓ భూ వివాదంలో 30 మంది దళితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో గత మూడు రోజులుగా జిల్లా హెడ్ క్వార్టర్ లోని పోలీస్ ఆడిటోరియంలో నిర్బంధించి హింసిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న విషయం పై బాధిత కుటుంబ సభ్యుల ప్రశ్నలకు పోలీసులు పొంతన లేని సమాధానం ఇస్తున్నారు.
అసలు పంచాయితీ ఇది
అక్రమ నిర్బంధం చేసిన 30 మంది దళిత రైతులు,భూ కేర్ టేకర్స్ ను వెంటనే అప్పజెప్పాలని లేదంటే హై కోర్ట్ ను ఆశ్రయిస్తామంటూ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ, హోమ్ మంత్రికి ఆ భూమితో సంబంధం ఉన్న తొమ్మిది కంపెనీ ల భూ యజమానులు లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ భూమిపై
మద్రాస్ హై కోర్ట్ స్టేటస్ కో ఇచ్చినప్పటికీ పోలీసులు అత్యుత్సహం ప్రదర్శిస్తూ ఓ కంపెనీకి అండగా ఉంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ 378 ఎకరాల భూ వివాదంలో తెలంగాణ,ఆంద్రప్రదేశ్,తమిళనాడు పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వివాదంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత, అక్కినేని నాగార్జున కుటుంబం తో పాటు మాక్స్ వర్త్ సహా మరో తొమ్మిది కంపెనీలున్నాయి. దీనిపై కోర్టుల్లో వివాదం నడుస్తుండగానే… భూమి వద్ద రాత్రికి రాత్రే అక్రమంగా మాక్స్ వర్త్ కంపెనీ పేరు తో బోర్డులు ఏర్పాటు చేశారని, మాక్స్ వర్త్ కంపెనీ కి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ తొమ్మిది కంపెనీలు ఆరోపిస్తున్నాయి.
మరోవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్న 30 మంది ఆచూకీ కోసం మర్రిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద వారి కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు.