ఎట్టకేలకు వాట్సాప్ డీపీల ముఠా ఆట కట్టించారు పోలీసులు. డీజీపీ, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఫోటోలతో డబ్బులు గుంజుతోంది ఈ గ్యాంగ్. సెలెబ్రిటీల ఫోటోల ద్వారా కొందరికి డబ్బులు పంపాలని మెసేజ్ లు పంపుతోంది. ప్రత్యేక బృందాలతో సెర్చింగ్ ఆపరేషన్ చేసిన పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూన్ 27న తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటో ఉన్న వాట్సాప్ ఐడీతో కొందరు పోలీస్ అధికారులకు మెసేజ్ లు వెళ్లాయి. డబ్బులు కావాలని అందులో ఉంది. అది చూసి సదరు అధికారులంతా షాకయ్యారు. డీజీపీ ఏంటి డబ్బులు అడగడమేంటని అసలు విషయం ఆయనకు చేరవేశారు. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు మహేందర్ రెడ్డి.
స్పెషల్ టీమ్స్ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. డీజీపీతో పాటు కొందరు జిల్లాల ఎస్పీల పేర్లతోనూ డబ్బుల కోసం వేట సాగించినట్లు తేలింది. రాజస్థాన్ కేంద్రంగా ముఠా నడుస్తోందని గుర్తించిన పోలీసులు సైబర్ కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.
ఐఏఎస్ అధికారులను సైతం వదలడం లేదు సైబర్ నేరళ్లు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేరుతో గతంలో సోషల్ మీడియాలో డబ్బులు కావాలని అడిగారు. ఏప్రిల్ లో ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేరుతోనూ మోసాలకు పాల్పడ్డారు.