తమ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలిచిన తీరుపై కాంగ్రెస్ మండిపడింది. ఈ మేరకు ఈడీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ దేశ వ్యాప్త ఆందోళనలను పార్టీ నిర్వహించింది.
రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించేంత సేపు ఈడీ కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ తీర్మానించింది.
ఈ క్రమంలో పార్టీకి చెందిన ప్రముఖ నేతలను మధ్యాహ్న సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు పోలీసులు తరలించారు. అనంతరం వారిని పోలీసులు విడుదల చేశారు.
అరెస్టైన వారిలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. వీరితో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సహా మరికొందరు నేతలు ఉన్నారు.
ఢిల్లీలో అరెస్టు సమయంలో వేణుగోపాల్ ను పోలీసులు ఈడ్చుకు వెళ్లిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నేతల పట్ల ఇలా దురుసుగా ప్రవర్తిస్తారా ? పోలీసులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో జరిగిన నిరసనల్లో రాష్ట్ర అధ్యక్షుడు అళగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార మంగళం, ఇతర నేతలు పాల్గొన్నారు. ఒడిశాలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేసి తమ నిరసనను తెలిపారు.
మహారాష్ట్రలో రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. బెంగాల్ లో నేపాల్ మెహత నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.