బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఏడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కిడ్నాప్‌లో పాలుపంచుకున్న నిందితులకు ఇతర కేసుల్లోనూ ప్రమేయం ఉందని.. వాటి గురించి విచారణ జరపాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధమున్న అఖిలప్రియ భర్తను కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. కిడ్నాపర్లు బాధితులను బెదిరించి సంతకాలు తీసుకున్న పత్రాలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని.. అలాగే కిడ్నాప్‌కు సంబంధించిన సీన్ రి కన్‌స్ట్రక్షన్ చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తామని పిటిషన్‌లో పోలీసులు వివరించారు. దీంతో వారం రోజుల పాటు ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోరారు. మరోవైపు అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. భార్గవ రామ్ ప్రస్తుతం బెంగళూరులో తలదాచుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. దీంతో బెంగళూరు పోలీసుల సాయంతో ఆయన ఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. అఖిలప్రియతో పాటు భార్గవ రామ్ సన్నిహితుల నివాసాలపై నిఘా పెట్టారు.