చిలకలగూడ పీఎస్ పరిధిలోని మెట్టుగూడలో జిమ్ ట్రైనర్ ను చావబాదారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడలో జిమ్ ట్రైనర్ గా చేస్తున్నారు ఆరోఖ్యరాజ్. అయితే.. శుక్రవారం బైక్ వేగంగా నడపడంపై ఒక వ్యక్తిని మందలించాడు. ఆ తర్వాత మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. అవతలి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు ఆరోఖ్యరాజ్ దగ్గరకు వెళ్లారు. తమతోపాటు పోలీస్ స్టేషన్ కు రావాలన్నారు. కానీ.. అతను ఈ సమయంలో ఎందుకు.. ఉదయం వస్తానని చెబుతూ దుర్భాషలాడాడు.
ఆరోఖ్యరాజ్ వ్యాఖ్యలతో పోలీసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కర్రలతో బూట్లతో దాడి చేశారు. కొట్టొద్దంటూ అతడి తల్లి ప్రాధేయపడింది. ఈ దాడిలో అతడి శరీరమంతా గాయాలు కాగా.. ఓ కాలు విరిగింది. బస్తీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులు అతడ్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. స్థానికులే బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు.
తీవ్ర గాయాలపాలైన ఆరోఖ్యరాజ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి దృశ్యాలు రహస్యంగా రికార్డ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరోఖ్యరాజ్ తో పోలీసులు బేరాలు సాగిస్తున్నట్లు బాధితుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. విచక్షణా రహితంగా దాడి చేసిన నలుగురు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆరోఖ్యరాజే ముందు తమపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని.. అందుకే తాము ప్రతిదాడి చేశామని పోలీసులు చెబుతున్నారు.