టీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ గులాబీలకు కోపం తెప్పించింది. దాని ఫలితంగా సదరు వ్యక్తి నడవలేని స్థితికి వెళ్లాడు. అదెలా అంటారా?.. టీఆర్‌ఎస్ నేతలకు కోపం వస్తే పోలీసులు ఊరుకుంటారా? చావబాది వదిలిపెడతారు కదా. ఇక్కడా అదే జరిగిందని బాధితుడు చెబుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో కుర్మ కులస్థులు భీరన్న పట్నాలు పండుగ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక టీఆర్‌ఎస్ నేతలను ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడితోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. నాన్ వెజ్ భోజనం చేశారు. ఆ సమయంలో ఫోటోలు తీశారు. దానికి సంబంధించిన ఓ ఫోటోను టీఆర్‌ఎస్ చొప్పదండి నియోజకవర్గం అనే వాట్సాప్ గ్రూప్ లో తొంటి పవన్ కుమార్ అనే వ్యక్తి పోస్ట్ చేసి “బొక్క ఆశకు కుక్క వచ్చింది” అని కామెంట్ చేశాడు.
పవన్ పోస్ట్ తో రగిలిపోయిన మండలాధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియదని.. అక్కడ చాలామంది ఉన్నామని.. దీనివల్ల గ్రూపు గొడవలు జరిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతే.. వెంటనే పోలీసులు యాక్షన్ షురూ చేశారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు.
ఎమ్మెల్యేను ఉద్దేశించే పవన్ పోస్ట్ చేశాడంటూ టీఆర్‌ఎస్ శ్రేణులు అతడిపై మండిపడుతున్నారు. పోలీసులు కూడా ఎమ్మెల్యే చెబితే వదిలేస్తామని తనతో అన్నట్టుగా చెబుతున్నాడు బాధితుడు. లాఠీలతో బాగా కొట్టారని వాపోతున్నాడు.