తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. అధినేత మెప్పు కోసం సంక్షేమ సారధి.. దేశానికే వారధి.. ఉద్యమాల వీరుడు.. పాలనలో ధీరుడు అంటూ ఎక్కడిక్కడే ఫ్లెక్సీలతో నింపేశారు. హైదరాబాద్ లో అయితే.. మెట్రో పిల్లర్స్ అన్నీ గులాబీమయం అయిపోయాయి. జిల్లాల్లో పాలాభిషేకాలతో సందడిగా కార్యక్రమాలు నిర్వహించారు.
మంత్రుల నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా స్వామి భక్తి చూపిస్తూ.. కేసీఆర్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారు. ఇటు పోలీస్ శాఖ సైతం సీఎంకు బర్త్ డే గిఫ్ట్ గట్టిగానే ఇచ్చారని చెబుతున్నారు రాజకీయ పండితులు. ఓవైపు టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దీంతో కాంగ్రెస్ నేతల గృహనిర్బంధాలు.. కార్యకర్తలు అరెస్టులతో సీఎంను పోలీసులు సంతోషపెట్టారని అంటున్నారు.
బుధవారం నుంచి టీపీసీసీ చీఫ్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి రేవంత్ ను అరెస్ట్ చేశారు. గోల్కొండ పీఎస్ కు తరలించారు. ఈ సమందర్భంగా మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయించి.. కేటీఆర్ తన తండ్రికి నజరానా ఇవ్వదలుచుకున్నారా? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే.. రేవంత్ చెప్పిన దాంట్లో తప్పేముందని అంటున్నారు విశ్లేషకులు. కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకపోవడం దారుణమని చెబుతున్నారు.
మరోవైపు.. రేవంత్ పిలుపుతో.. పోలీసుల కన్నుగప్పి కేసీఆర్ బర్త్ డే ఉత్సవాలను వ్యతిరేకిస్తూ పలుచోట్ల కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు కొనసాగించారు. గాడిద ఫ్లెక్సీలు పెట్టి.. కేక్ లు కట్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి పోలీసులు అయితే.. కేసీఆర్ కు రేవంత్ సహా కీలక నేతలను అరెస్ట్ చేసి మంచి గిఫ్ట్ ఇచ్చారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.