తెలంగాణ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేసేందుకు కేవలం ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో.. విరమించాలని పోలీసులు కోరారు. అయినా ఆమె దీక్షను కొనసాగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భగ్నం చేశారు.
మరోవైపు దీక్ష భగ్నం చేసిన తర్వాత షర్మిల అక్కడనుంచి లోటస్‌పాండ్ వరకు పాదయాత్ర చేసేందుకు షర్మిల ప్రయత్నం చేశారు. అలా తెలుగుతల్లి ఫ్లైఓవర్ వరకు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, షర్మిల అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఈక్రమంలోనే ఆమె స్పృహతప్పిపడిపోయారు. షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బేగంపేట్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి షర్మిలను లోటస్‌పాండ్‌కు తీసుకెళ్లారు.
ఇదిలా ఉంటే తాను దీక్ష విరమించేది లేదని అంతకముందు షర్మిల చెప్పారు. 72 గంటల దీక్షకు తాను పూనుకున్నానని.. ఎక్కడికి తరలించినా పాదయాత్రగా వచ్చి తిరిగి కొనసాగిస్తానంటూ చెప్పారు.