హీరోయిన్ తాప్సీ పన్నుపై కేసు పెట్టారు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు. ఇటీవల ఆమె చేసిన ఓ ఫ్యాషన్ షోలో తాప్సీ వేసుకున్న ఆభరణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు బుక్ చేశారు. ఫ్యాషన్ షోలో లక్ష్మీదేవి లాకెట్ తో ర్యాంప్ వాక్ చేయడం.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కుమారుడు ఏకలవ్య గౌర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.
డీటైల్స్ లోకి వెళ్తే.. మార్చి 12న ముంబైలో జరిగిన ‘లాక్ మీ ఫ్యాషన్ వీక్-2023’ షోలో తాప్సీ ర్యాంప్ వాక్ చేసింది. ఆ షోలో తాప్సీ తన మెడలో హిందువుల ఆరాధించే లక్ష్మీదేవి హారం వేసుకుంది. డీప్ నెక్ కవర్ అయ్యేట్టు ఆ ఆభరణాన్ని ధరించింది. అందులో ఉన్న లక్ష్మీ దేవి విగ్రహం ఆ ఆభరణానికే హైలెట్ గా నిలిచింది.
అయితే ఫ్యాషన్ షో అంటేనే మితిమీరిన గ్లామర్ ప్రదర్శన షో ఉంటుంది.. అలా ఎక్స్ పోజింగ్ చేసే వాళ్ళు దేవతల లాకెట్లు ధరించడం ఏంటని ప్రశ్నిస్తూ.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో తాప్సీపై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మాలినీ కుమారుడు ఏకలవ్య. హిందూ దేవతలను అవమానించిందంటూ, లక్ష్మీదేవి లాకెట్ ధరించి అశ్లీలతను వ్యాప్తి చేశారని మండిపడ్డారు.
లక్ష్మీదేవి లాకెట్ తో అభ్యంతరకరమైన దుస్తులు వేసుకుని తాప్సీ క్యాట్ వాక్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బ తీసిందని వచ్చిన ఫిర్యాదు మేరకు తాప్సీపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. మరి ఈ విషయం తాప్సీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.