ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ చిక్కుల్లో పడ్డారు. వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. ఇందులో వ్యాపార లావా‘దేవీ’లతో పాటు అసలు కారణం కూడా వేరోటి వుందంటున్నారు..
కర్నూలు: కర్నూలు జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తికి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. మిగిలిన 60 శాతం వాటా తమ పేరుపై బదిలీ చెయ్యాలని శివారామిరెడ్డి కుటుంబసభ్యులపై బెదిరింపులకు దిగినట్టు బాధితుల ఆరోపణ. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు.
ఇలావుంటే, అఖిలప్రియ భర్తపై ఫిర్యాదు చేయడంతో అసలీ వ్యవహారమంతా బయటికొచ్చింది. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ తన భర్తపై హత్యాయత్నం చేసినట్టు శివరామిరెడ్డి భార్య మాధవీలత ఆళ్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 14వ తేదీన భార్గవ్‌రామ్, అతడి అనుచరులు ఫ్యాక్టరీకి వచ్చి అక్కడున్న వారిని తరిమేసి తాళాలు వేశారని, 27వ తేదీన మరో పరిశ్రమను స్వాధీనం చేసుకున్నారని, ఈ రెండింటిని తమ పేరిట రాసివ్వాలని డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
కథ కేసుల వరకు రావడానికి మరో రీజన్ కూడా వుందని లోకల్ పబ్లిక్ టాక్. ఈ వ్యవహారం వెనుక ఒక వన్‌సైడ్ లవ్‌స్టోరీ వుందంటున్నారు. ఏడాది క్రితం శివరామిరెడ్డి రాసిన ప్రేమలేఖ ఇప్పుడీ గొడవకు కారణమని, అది కూడా కేవలం అనుమానంతోనే దాడి చేశారని ఆళ్లగడ్డలో పబ్లిక్ అనుకుంటున్నారు.