చేసింది కొన్ని సినిమాలే అయినా.. ఎక్స్ పోజింగ్ తో సపరేట్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది డింపుల్ హయతి. ఈమధ్య గోపీచంద్ హీరోగా చేసిన రామబాణం సినిమాలో నటించింది. అంతకుముందు రవితేజతో కలిసి ఖిలాడీ సినిమా చేసింది. అయితే.. ఈ ముద్దుగుమ్మ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే…
జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఎస్‌కేఆర్ ఎన్ క్లేవ్ అపార్ట్‌మెంట్ ఉంది. ఇందులో ఐపీఎస్ అధికారి నగర ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పని చేస్తున్న రాహుల్ హెగ్డే ఉంటున్నారు. ఇదే అపార్ట్ మెంట్ లో హీరోయిన్ డింపుల్ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్ తో కలిసి ఉంటోంది. అయితే.. పార్కింగ్ విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి.
పార్కింగ్ స్థలంలో డీసీపీకి చెందిన అధికారిక వాహనానికి అడ్డుగా డింపుల్, డేవిడ్ తమ కారును పెట్టడంతోపాటు.. అకారణంగా కారు డ్రైవర్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ తో వాగ్వాదానికి దిగుతున్నారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్ చేసుకోవాలని చెప్పినా వినిపించుకోలేదు. ఈ క్రమంలో ఈనెల 14న రాత్రి పార్క్ చేసిన డీసీపీ వాహనాన్ని డింపుల్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది.
డింపుల్ తీరును ప్రశ్నించిన కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించింది. దీంతో అతను జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో డింపుల్ తోపాటు ఆమె ఫ్రెండ్ డేవిడ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీఆర్‌పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చి పంపించారు.