రౌడీలను పట్టుకోవడానికి పోలీసులు చేజ్ చేయడం.. నిందితుడు తప్పించుకోవడానికి చిన్న పిల్లలకు కానీ.. దారిలో దొరికిన వారికి కానీ.. మెడ మీద కత్తి పెట్టి నన్ను వదిలేయండి.. లేదంటే పీక కోస్తా అనడం వంటి డైలాగ్ లు సహజంగా సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. సేమ్ టూ సేమ్ సినీ ఫక్కీలో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని టోలిచౌక్ లో చోటుచేసుకుంది.
టోలిచౌక్ ప్రాంతంలో స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చిన నాంపల్లికి చెందిన రౌడీషీటర్ ఫరీద్ క్వాద్రీ ని తనిఖీల్లో భాగంగా ఆపారు పోలీసులు. దీంతో రెచ్చిపోయిన ఫరీద్ హల్ చల్ సృష్టించాడు. తనిఖీలు చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోయాడు.
అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలోకి వెళ్లాడు రౌడీషీటర్. అక్కడికీ పోలీసులు రావడంతో చేసేదేం లేక.. హాస్పిటల్ కు వచ్చిన ఓ పేషంట్ మెడపై కత్తి పెట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు. తనను వదిలిపెట్టకుంటే పేషంట్ పీక కోస్తానని బెదిరించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన గోల్గొండ ఇన్స్పెక్టర్ పై దాడికి దిగాడు.
చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ చేజింగ్ ను చూసిన స్థానికులు ఆ ప్రాంతంలో ఏదో సినిమా షూటింగ్ జరుగుతోందని చూస్తూ ఉండిపోయారు. చివరకు అది సినిమా కాదని తెలవడంతో ఆశ్చర్యపోయారు. పోలీసుల సాహసాన్ని చూసి అభినందించారు.