జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనవాణి కార్యక్రమం కోసం పవన్ వైజాగ్ వచ్చారు. ఆయన నగరంలోని నోవాటెల్ హెటల్ లో బస చేశారు. జనసేనానితో పాటుగా నాగబాబు, నాదెండ్ల మనోహర్ కూడా అదే హొటల్ లో ఉన్నారు.
అయితే పోలీసులు వారు బస చేసిన ఫ్లోర్ లో తనిఖీలు చేశారు. దానిలో భాగంగా పలువురు నాయకుల్ని వారు అదుపులోనికి తీసుకున్నారు. హోటల్ పరిసరాల్లోకి జనసేన కార్యకర్తలతో పాటు మరెవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
కొంతమంది జనసేన నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు నాగబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతే కాకుండా పోలీసులు పవన్ ఉన్న రూమ్ వద్దకు కూడా వచ్చారని పేర్కొన్నారు.
విమానశ్రయంలో పవన్ కు స్వాగతం పలికే సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పవన్ కు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికేందుకు ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే విశాఖ గర్జన కార్యక్రమం ముగించుకున్న మంత్రులు జోగి రమేశ్, రోజా, విడదల రజినీ, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తిరిగి వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు.
మంత్రుల వాహనాలను చూడగానే జనసేన కార్యకర్తలు జగన్ సర్కారుకు, వైఎస్సార్పీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అధికార పార్టీ నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసరడంతో.. మంత్రి రోజా సహాయకుడికి గాయమైంది. దీంతో అక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు తలెత్తాయి.
సీఐఎస్‌ఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. అప్పటికీ జనసేనాని ఇంకా ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదు. అధికార పార్టీ నేతల వాహనాలపై దాడి జరిగిన సమాచారం అందడంతో విశాఖ సీపీ శ్రీకాంత్ రంగంలోకి దిగారు. కమిషనర్ ఆదేశాలతో విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి యత్నించిన వారిని గుర్తించి సెక్షన్ 307తో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
జనసేన నాయకులను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్న పవన్ కళ్యాణ్ వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఆయన డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. తమ పార్టీ ఎప్పుడూ పోలీసులను గౌరవిస్తోందన్నారు. పోలీసులు వ్యవహార శైలి పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.