నిర్మల్ జిల్లాలో పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని తలపెట్టారు. భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ లో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎటూ ఇంటింటికి తిరుగుతున్నామనుకున్నారో ఏమో కానీ.. వైద్య సిబ్బందితో సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోని వారికి వ్యాక్సిన్ ఇప్పించే కార్యాన్ని చేపట్టారు.
భైంసా ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పట్టణంలోని ఇంటింటికి తిరిగి వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో పాటు కరోనా టీకాలు వేసుకోని వారిని గుర్తించి.. వారికి అవగాహన కల్పిస్తూ.. దగ్గరుండి వైద్య సిబ్బందితో టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో 100 మంది పోలీసులు పాల్గొన్నారు. కార్డెన్ అండ్ సెర్చ్ లో భాగంగా దృవపత్రాలు లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశారు పోలీసులు. కార్డెన్ అండ్ సెర్చ్ తో పాటు ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఆలోచించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.