ఫిబ్రవరి 24వ తేదీన శుక్రవారం రాత్రి 10 గంటలకు హైటెక్ సిటీలో ఓ యాక్సిడెంట్ జరిగింది. బైక్ పై శ్రవణ్, కీర్తి అనే జంట కూకట్ పల్లి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ బడాబాబు కారు వెనుక నుంచి వచ్చి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో భార్యభర్తలు ఇద్దరూ బైక్ పై నుంచి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అయితే చుట్టూ జనం చుస్తూండటంతో.. వాళ్ళను తన కారులోనే ఎక్కించుకుని యశోద హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు ఆ ఆగంతకుడు.
అనంతరం రోడ్డు ప్రమాదంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ అడిగాడు బాధితుడు శ్రవణ్. అయితే ఆ మార్గంలోని కెమెరాలు ఏమీ పని చేయడం లేదని పోలీసులు చెప్పుకొచ్చారట. కానీ శ్రవణ్ అక్కడితో ఆగలేదు. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడకు వెళ్లి.. ఓ సీసీ టీవీ ఫుటేజీని సంపాదించి తనే పోలీసులకు అందించాడు.
యాక్సిడెంట్ లో పాడైన తన బైక్ ను ఇన్సూరెన్స్ లో బాగుచేయించుకోవాలంటే ఎఫ్ఐఆర్ అడుగుతున్నారని మాదాపూర్ స్టేషన్ కి వెళ్లి అడగ్గా చేతికి ఎఫ్ఐఆర్ ఇవ్వాలంటే రూ.1000 ఖర్చు అవుతుందని ఓ కానిస్టేబులమ్మ బేరసారాలకు దిగిందట. పైనున్న ఎస్ఐకి వెయ్యి ఇవ్వనిదే ఎఫ్ఐఆర్ ఇవ్వమని చెప్పిందట.
అయితే తాము ఎలాంటి పొజిషన్ లో ఉన్నామో.. ఈ సమయంలో న్యాయం చేయాల్సిన మీరే ఇలా డబ్బులు అడగొచ్చా అని ప్రశ్నించగా.. అప్పుడు చేతికి ఎఫ్ఐఆర్ అందించారట. కానీ వారం రోజులు అవుతున్నా ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అందించడం లేదని బాధితుడు ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో తన బాధను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.