యూపీలో పోలీసులు ఓ అత్యాచార నిందితుడి ఇంటి గోడను, మెట్లను కూల్చేశారు. లొంగిపోవాలని పేర్కొంటూ ఊరంతా చాటింపు వేశారు. సహరన్ పూర్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సహరన్ పూర్ కు చెందిన ఓ బాలికను ఆ గ్రామ పెద్ద కుమారుడు అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలి తల్లి గత ఏడాది డిసెంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన బిడ్డ మైనారిటీ తీరి 18 ఏండ్లు నిండగానే తమ దగ్గరకు వెళ్లి తన కూతురును పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.
దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్ద మనిషి తనను చంపేస్తానని బెదిరించారని.. అంతే కాకుండా ఆ తర్వాత కూడా గ్రామ పెద్దమనిషి ఇద్దరు కుమారులు తాను ఇంట్లో లేని సమయంలో మరో సారి తన కుమార్తెపైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులకు నోటీసులు పంపించారు. అయినప్పటికీ వారివద్దనుండి ఎలాంటి స్పందన రాలేదు. ఎన్ని రోజులు ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. దీంతో నిందితుల ఇంటికి బుల్డోజర్ ను తీసుకెళ్లి ఇంటి మెట్లను, గోడను పాక్షికంగా కూల్చేశారు పోలీసులు. వెంటనే లొంగిపోవాలని ఆదేశించారు.