మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పెద్దఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు దీక్షకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే.. చివరి నిమిషంలో ఆమెకు షాకిచ్చారు ఢిల్లీ పోలీసులు. జంతర్ మంతర్ లో దీక్షకు అనుమతిని రద్దు చేశారు.
ధర్నా కోసం మరో ప్రాంతం చూసుకోవాలని సూచించారు పోలీసులు. ఆఖరి నిమిషంలో అనుమతులు రద్దు చేయడంతో ఉత్కంఠగా మారింది. ఇటు జంతర్ మంతర్ లో ధర్నా చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని పరిశీలించారు కవిత. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ధర్నా ప్లేస్ మార్చుకోవాలని పోలీసులు చెప్పారని అన్నారు. జంతర్ మంతర్ లో ధర్నా కోసం ముందే అనుమతి కోరామని తెలిపారు.
5వేల మంది వస్తారని చెప్పి పర్మిషన్ అడిగామని.. అడిగిన స్థలంలో సగమే ఇస్తామంటున్నారని అన్నారు కవిత. ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. బీజేపీ వాళ్లు వేరే అంశంపై ఆందోళనకు పర్మిషన్ అడిగారని చెప్పారని తెలిపారు. సడెన్ గా బీజేపీ ధర్నా అనేసరికి గందరగోళం తలెత్తిందని.. పర్మిషన్ వచ్చిన తర్వాత పనులు మొదలుపెడతామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష ఆగదు.. కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అంతకుముందు, ప్రెస్ మీట్ లో మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం కొనసాగుతోందన్నారు కవిత. ఏళ్లు గడుస్తున్నా మహిళా బిల్లుకు ఇంతవరకు పార్లమెంట్ ఆమోదం పొందలేదని చెప్పారు. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ, ఆ బిల్లుకు మాత్రం మోక్షం దక్కడం లేదన్నారు. మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్ లో పడేశారని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ బిల్లు తెస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. శుక్రవారం ధర్నాలో 18 పార్టీలు పాల్గొంటున్నాయని.. ఏచూరి చేతులమీదుగా దీక్ష ప్రారంభం అవుతుందని వివరించారు కవిత. కానీ, చివరి నిమిషంలో పోలీసులు షాక్ ఇవ్వడంతో ఏం జరుగుతుందో చూడాలి.