ఇంకెన్నాళ్లీ తప్పుడు కేసులు...? - Tolivelugu

ఇంకెన్నాళ్లీ తప్పుడు కేసులు…?

police department files new fake case on tv9 former ceo ravi prakash, ఇంకెన్నాళ్లీ తప్పుడు కేసులు…?

 

అక్షరాలతో మంటల్ని రగిలించే పెన్నుకు చెదలు పట్టించాలనే కాంక్ష కొనసాగుతోంది. అక్షరం ఆయుధంగా మారకుండా ఉండేందుకు రాజ్యం పరుగుపెడుతోంది. అవినీతి శక్తుల వెన్నులో వణుకు పుట్టించే స్వరాన్ని ఆపే ప్రయత్నం కొనసాగుతోంది. దిక్కుతోచని స్థితిలో వ్యవస్థలోని లోపాలతో తప్పించుకునే ఆరాటం కొనసాగుతోంది.

రాజ్యం అణిచివేత ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు కొత్త కాదు. రాజ్యానికి ఎదురు తిరిగే వారికి ఎన్ని బాధలుంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఎదురు తిరుగుతోన్న అక్షరాల వెల్లువను ఆపేందుకు రాజ్యానికి, అవినీతి సామ్రాజ్యాలు తోడవుతున్నాయి. ఒక్క క్షణం ఆపినా చాలులే.. అన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే చట్టాల పుస్తకాలను తిరగేస్తున్నారు. ఎక్కడ ఎలా బయటపడొచ్చంటూ భయ పడుతూ… పరుగులు తీస్తున్నారు.

మీడియా లెజెండ్ రవిప్రకాశ్‌ను జైలుకే పరిమితం చేయ్యాలనే రాజ్యం కుట్రలు కొనసాగుతోన్నాయని ఆరోపిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. ఒక కేసులో బయటకొచ్చేస్తారు అనుకునే లోపే మరో కొత్త కేసుతో వస్తున్నారు. సరే… నిజమే, తప్పు చేశారనే అనుకుందాం. ఆ కేసు తాలుకు ఎఫ్.ఐ.ఆర్ కాపీని ఇవ్వటానికి ఎందుకు జంకుతున్నారు అని జర్నలిస్ట్‌ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కనీసం రవిప్రకాశ్ కుటుంబ సభ్యులకు అయినా… తనని ఎటు తీసుకెళ్తున్నారు, ఏ కేసులో అరెస్ట్‌ చేస్తున్నారు అన్న కనీస సమాచారం ఇవ్వాలి. ఆ కేసు, ఈ కేసంటూ… ఓ కేసులో బెయిల్ రాగానే, మరో కేసును పోలీసులు తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు.

ఎలాగైనా జైలులోనే ఉంచాలన్న ఎత్తుగడతో వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకొని ఇలాంటి తప్పుడు కేసులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు రవిప్రకాశ్ సన్నిహితులు. ఒకవేళ కేసులుంటే ముందే చెప్పాలి, లేదా ఫలానా కేసులో అదుపులోకి తీసుకుంటున్నాం అని కుటుంబ సభ్యులకు సమాచారం అయినా ఇవ్వాలి. ఏదీ చేయకుండా, చెప్పకుండా… అధికారం ఉంది కదా అని ఇలా జులుం చెలాయిస్తే  న్యాయస్థానాల ముందు నిలబెడతాం అని హెచ్చరిస్తున్నారు జర్నలిస్ట్‌లు.

ధిక్కార స్వరాన్ని అణచివేయాలనుకొనే ఎత్తుగడలు ఎప్పటికీ సాగవని, తాత్కాలిక పరాజయాలకు భయపడని తత్వమే ఇక్కడి వరకు ప్రయాణించేలా చేసిందన్న సత్యాన్ని మరవొద్దని హెచ్చరిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp