బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా బీజేపీ సికింద్రాబాద్ లో క్యాండిల్ ర్యాలీకి సిద్ధమౌతోంది. అయితే.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు పోలీసులు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. కానీ, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు నిరసన తెలుపుతామని అంటున్నారు. ఈ క్రమంలో ర్యాలీలో ఎంతమంది పాల్గొంటారో చెప్పాలని పోలీసులు అడిగారు.
ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం భారీ ర్యాలీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని అంటున్నారు పోలీసులు. ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతి ఇవ్వలేమని.. ఈనెల 10 వరకు ర్యాలీలు, సభలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ లో పలు ఆస్పత్రులు ఉన్నాయన్న పోలీసులు.. రోగులు, అంబులెన్స్ లకు ఇబ్బందులు కలుగుతాయన్న చెబుతున్నారు.