కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన సమత కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్ లో మొత్తం 44 మంది సాక్ష్యులను చేర్చారు. సోమవారం నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ ప్రారంభం కానుంది. రోజు కు ఐదుగురు సాక్ష్యుల చొప్పున విచారించే అవకాశం ఉంది. కేసులో ఏ(1) నిందితుడిగా షేక్ బాబు (30), ఏ(2) షేక్ షాబొద్దీన్(40), ఏ(3) షేక్ ముఖ్దుం(30)) లను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ ముగ్గురు గత నెల 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామం శివారులో సమతపై అత్యాచారం చేశారు. అనంతరం దారుణంగా హత్య చేశారు.
బుగ్గలు, చిల్లర సామానులు అమ్ముకొని బతికే దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ వేరే ఊరుకు వెళ్లి తిరిగివస్తుండగా కాపు కాసిన కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సంఘటన జరిగిన కొన్ని రోజుల వరకు పోలీసులు ఈ ఘటనను పట్టించుకోలేదు. దళిత, హక్కుల సంఘాలు దీనిపై ఆందోళనకు దిగడంతో పాలనా యంత్రాంగం హడావుడిగా విచారణ ప్రారంభించింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆదేశిలిచ్చారు.