సమ్మె చేస్తున్న కార్మికులు, నేతలపై పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసన తెలుపుతున్న సీపీఎం-ఎల్ నాయకులపై పోలీసులు చూపిన అత్యుత్సాహంతో న్యూడెమాక్రసీ నాయకుడు రంగారావు బొటన వేలు సగం వరకు తెగిపోయింది.
ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో.. వ్యాన్‌లోకి రంగారావును ఎక్కిస్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు తలపుల మధ్య చేయి వేసి, పోలీసులు హింసించారని రంగారావు ఆరోపించారు. దీంతో బొటనవేలు తెగిపోయింది. ఒకవైపు రక్తమోడుతున్నా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనపై పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తనను కేసీఆర్ చంపమన్నాడా అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు.. ఇప్పుడు కార్మికుల పక్షాన నిలిచినందుకు.. తనకు లభించిన బహుమానమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ మాటలకు భయపడని కార్మికులకు అండగా అఖిలపక్షాలు, స్టూడెంట్ సంఘాలు, యూనియన్ సంఘాలు రాష్ట్ర బంద్‌లో పాల్గొంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర బంద్ కు ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షాలు వివిధ యూనియన్ సంఘాల నాయకులూ, విద్యార్థి సంఘాలు ఎక్కడికక్కడే నిరసనలు తెలుపుతున్న తరుణం లో పోలీస్ లు ఎక్కడికక్కే అరెస్ట్ లు చేస్తున్నారు.