పంచాయతీ నిధుల విషయంలో ప్రభుత్వాన్ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నాయి ప్రతిపక్షాలు. నిధులు దారి మళ్లించారని.. సర్పంచులు నానా అవస్థలు పడుతున్నారని మండిపడుతున్నాయి. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు ప్లాన్ చేసింది. కానీ, అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడే నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆ సమయంలో పోలీసులు అనుసరించిన తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని వదల్లేదు. హైకోర్టును ఆశ్రయించింది. సర్పంచులకు అండగా తాము చేపట్టే ధర్నాను అడ్డుకున్నారని పిటిషన్ వేసింది. తమ నిరసనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరింది.
కాంగ్రెస్ అభ్యర్థనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కండిషన్స్ తో ధర్నాకు ఓకే చెప్పింది. దీంతో చేసేదేం లేక పోలీసులు అనుమతినిచ్చారు. ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరగనుంది. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు.
‘రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ధర్నా’ పేరుతో కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులు ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.