ప్రస్తుత కాలంలో ఏ విషయం గురించైన తెలియాక పోతే వెంటనే మనం చేసే పని గూగుల్ లో వెదికేయడమే. అయితే గూగుల్ లో కేవలం సమాచారం మాత్రమే దొరుకుతోంది. అదే యూట్యూబ్ లో అయితే కళ్లకు కట్టినట్లు చూపిస్తారు కూడా. దీంతో ఎంతో మంది యూట్యూబ్ వీడియోలు చూస్తూ తమ పనులు చేసుకుంటున్నారు.
కొందరు సొంతంగా వంట చేసుకుంటుంటే.. కొందరు వైద్యం నేర్చుకుంటున్నారు. కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు కూడా. తాజాగా ఓ వ్యక్తి దొంగతనం ఎలా చేయాలో కూడా యూట్యూబ్ లో చూశాడట.. దాని ప్రకారం..చోరీకి ప్లాన్ వేశాడు.చేసిన అప్పులు తీర్చలేక.. యూట్యూబ్ చూసిఈజీగా చోరీ చేసి.. ఆ అప్పులు తీర్చేయాలనుకున్నాడు.
కానీ… అది కాస్త బెడిసికొట్టింది. కొత్త కష్టాలు కొని తెచ్చుకొని ఊచలు లెక్కబెడుతున్నాడు. అసలేం జరిగిందంటే… మెట్ పల్లి మండలం వేంపేటలో కెనరా బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన అప్పులు చెల్లించడానికి యూట్యూబ్ లో వీడియోలో చూసి చోరీకి ప్రయత్నించడం విశేషం.
ఈ ఘటనపై మీడియాకు వివరించారు… సీఐ శ్రీను, ఎస్సై సుధాకర్, రామచంద్రం.. వారు చెబుతున్న విషయాల ప్రకారం…ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ కు చెందిన రాజేష్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రూ.12 లక్షల వరకు అప్పుచేసి ఓ వాహనాన్ని కొనుగోలు చేశాడు. దానిని సక్రమంగా వినియోగించకపోవడం వల్ల అప్పులు కూరుకుపోయాడు.
అప్పులు తీర్చలేకపోయాడు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి గొడవ చేస్తుండడంతో 15 రోజుల క్రితం మెట్పల్లికి మకాం మార్చాడు. అంతేకాకుండా దొంగతనం చేసి అప్పులు చెల్లించాలనుకున్నాడు. యూట్యూబ్ లో చూసి ఏటీఎం దొంగతనం చేసే వీడియోలను చూశాడు. అదే రీతిన ఏటీఎంలో డబ్బులు దొంగిలించాలని స్కెచ్ వేశాడు.
మెట్‌పల్లి ఎస్‌బీఐ, వేంపేటలోని కెనరా బ్యాంకు ఏటీఎంలను ఎంపిక చేసుకొని భార్య ఏటీఎం కార్డుతో డబ్బులు తీసుకోవడానికి వెళ్లినట్లు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. అంతేకాకుండా దానికి అవసరమైన వస్తువులను కూడా దొంగతనం చేశాడు. అయితే ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించగా గ్యాస్ సిలిండర్ పనిచేయక పోవడంతో అక్కడ నుంచి వచ్చేశాడు.
మళ్లీ కెనరా బ్యాంకు ఏటీఎంకు చేరుకుని ముందుగా తలుపులు పగలగొట్టాడు. రెండో తలుపును గ్యాస్ తో కోయడానికి ప్రయత్నించిన అది తెరుచుకోలేదు. ఇక చేసేదేమి లేక ఇంటికి చేరుకున్నాడు. అయితే అక్కడ నుంచి మకాం మార్చేయాడానికి ప్రయత్నిస్తుండగా దొంగతనానికి వాడిన వాహనం, వస్తువులతో పోలీసులకు దొరికేశాడు.
పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు.