బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ నటిస్తున్న “లుకా చుప్పీ 2” సినిమా నిర్మాణ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాలో నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న బైక్ ను వాడినందుకు కేసు నమోదు చేసి నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.
సినిమా షూటింగ్ లో MP-09 UL 4872 నంబర్ గల బైక్ ను వినియోగించారు. షూటింగ్ లో భాగంగా హీరో విక్కీ కౌశల్.. హీరోయిన్ సారా అలీఖాన్ ను బైక్ పై ఎక్కించుకొని మధ్యప్రదేశ్ ఇండోర్ లో షికార్లు కొట్టారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే.. విక్కీ వినియోగించిన బైక్ నంబర్ నకిలీదని తేలింది. వీడియోను చేసి బైక్ నంబర్ ను గమనించిన ఇండోర్ కు చెందిన జైసింగ్ యాదవ్ షాక్ అయ్యాడు. తన స్కూటీ నంబర్ ప్లేట్ ను సినిమా షూటింగ్ లో ఉపయోగించారని.. ఆ నంబర్ వినియోగిస్తున్న వాహనం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే తాను బాధ్యత వహించాల్సి వస్తోందని.. ఆ నంబర్ అసలు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగించినందుకు సినిమా నిర్మాణ సంస్థపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.