దేశంలో అయిదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. పలు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు నాయకులు అగ్గి రాజేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టులు, పాత కేసుల తవ్వకాలు తెరమీదికి వచ్చాయి. వాటిలో భాగంగా బీజేపీకి రాజీనామా చేసి.. సమాజ్ వాది పార్టీలో చేరిన ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రిపై.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ఏడు సంవత్సరాల కిందటి కేసును తిరగదోడింది. ఇటు ఉత్తరాఖండ్ లో నిర్వహించిన ధర్మసంసద్ లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు.
హరిద్వార్ ధర్మసంసద్ సదస్సులో మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న యతి నరసింఘానంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనే ఆరోపణతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా హరిద్వార్ లో ఉన్నట్లు గుర్తించారు.
హరిద్వార్‌లో కిందటి నెల 17 నుంచి 19 వరకు ధర్మసంసద్ పేరుతో నిర్వహించిన సదస్సులో యతి నరసింఘానంద్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2029లో ముస్లిం ప్రధాన మంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. ముస్లిం ప్రధాని కావడాన్ని అడ్డుకోవడానికి హిందువులు కత్తులు పట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
దీని మూలంగా రాజకీయ విమర్శలు మరింత తీవ్రరూపం దాల్చాయి. నరసింఘానంద్ ను అరెస్ట్ చేయాలంటూ పలు ఫిర్యాదులు అందాయి. ధర్మసంసద్ సదస్సు కేసులో మొత్తం 10 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. జితేంద్ర త్యాగి, యతి నరసింఘానంద్ అరెస్ట్ కాగా.. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని ఉత్తరాఖండ్ పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగాలను సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై 10 రోజుల్లోగా సమగ్ర నివేదికను అందజేయాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.