ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా, కార్మికుల పక్షాన నిలబడేందుకు కాంగ్రెస్ చలో ప్రగతిభవన్ పిలుపునిచ్చింది. దాంతో పోలీసులు ఆదివారం రాత్రి నుండే కీలక నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవటం, లేదంటే… హౌజ్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. అర్ధరాత్రి నుండే పోలీసు వాహనాలు రేవంత్ ఇంటికి చేరుకున్నాయి.
అయితే విషయాన్ని ముందే పసిగట్టిన రేవంత్… రాత్రి నుండే ఇంట్లో లేరు. దాంతో పోలీసులు ఉదయం నుండి వెతకటం ప్రారంభించారు. ఆయన అనుచరులు, మద్దతుదారుల ఇండ్లు… హోటల్స్‌లో వెతకటం ప్రారంభించినా ఆయన ఎక్కడున్నారు అని మాత్రం కనిపెట్టలేకపోయారు. అయితే ఖచ్చితంగా నేను ప్రగతి భవన్ చేరకుంటాను అని రేవంత్ తన అనుచరులతో స్పష్టం చేస్తున్నారు.
అయితే, రేవంత్ ఎక్కడున్నారో స్పష్టంగా తెలియకపోయినా… ఆయన తీరిగ్గా ట్విట్టర్‌లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నేతలకు విషెష్ చెప్తున్నారు. మహ ఎన్నికల్లో తలపడుతోన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సులే, ఆ పార్టీకి ఆల్ ద బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు.
దీంతో… పోలీసులు సైతం, మేమంతా ఆయన ఎక్కడున్నారో అని పరుగులు పెడుతుంటే, ఆయనెక్కడో ప్రశాంతంగా ట్వీట్టర్‌తో ముచ్చటిస్తున్నారు అంటున్నారు.