వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే విషయలు బయట పడ్డాయి. మొత్తం రూ.2 కోట్లు దోపిడీకి గురైనట్లుగా పోలీసులు తెలిపారు. దోపిడీకి గురైన మొత్తం డబ్బు.. హవాలా డబ్బుగా గుర్తించారు పోలీసులు. హవాలా డబ్బుల కోసమే వెంకటరెడ్డి డ్రామాలాడాడని దర్యాప్తులో తేలింది.
మూడు రోజుల క్రితం రెండు కోట్ల రూపాయలు తీసుకువెళ్తుండగా దోపిడీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో దోపిడీ జరిగినట్లుగా ఫిర్యాదు చేశాడు వెంకటరెడ్డి. దోపిడీపై విచారణ చేస్తుండగా హవాలా వ్యవహారం బయటపడింది. అమెరికాలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రవీణ్ నేతృత్వంలో హవాలా లావాదేవీలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.
గత ఆరు నెలల కాలంలోనే 28 కోట్ల రూపాయల నగదు పంపించినట్లుగా గుర్తించారు అధికారులు. వెంకటరెడ్డి ఇంట్లో సోదాలు చేయగా.. రెండు కోట్ల 75 లక్షల రూపాయల హవాలా నగదు పట్టుబడింది. రియాసత్ నగర్ కు చెందిన షారుఖ్ తో కలిసి హవాలా లావాదేవీలు కొనసాగించాడు వెంకటరెడ్డి.
ప్రవీణ్, వెంకటరెడ్డి, షారూఖ్ ల హవాలా లావాదేవీలపై రాచకొండ పోలీసులు విచారణ జరుపుతున్నారు. యూఎస్ లో ఉన్న ప్రవీణ్ కి డబ్బులు ఎగ్గొట్టేందుకే వెంకటరెడ్డి ఈ దోపిడీ డ్రామా ఆడినట్టు పోలీసులు తెలిపారు.
అమెరికా నుండి ప్రవీణ్ అనే వ్యక్తి డబ్బులను పంపిస్తుండగా.. వాటిని హైదరాబాద్‌లో మార్పిడి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఎంఆర్ఆర్ బార్ యజమాని వెంకట్ రెడ్డి, రియాసత్ నగర్‌కు చెందిన షారుఖ్ లు ఈ హవాలా లావాదేవీలు నడుపుతున్నారు. వీరిద్దరికి అమెరికా నుంచి ఇప్పటి వరకు రూ. 28 కోట్ల డబ్బు చేరినట్లు తెలిసింది. ప్రస్తుతం షారుఖ్ పరారీలో ఉండగా.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.