కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా ప్రకంపణలు పుట్టించింది. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసన కారులు వీరంగం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు విద్యార్ధులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
విచారణలో పలు కీలక విషయాలు వెలువడినట్టు తెలుస్తోంది. విద్యార్ధులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. సికింద్రాబాద్ ఘటన వెనక నరసరావుపేటలో డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న సుబ్బారావు పాత్ర ఉండొచ్చనే అనుమానంతో.. ప్రకాశం జిల్లా కంభంలో రైల్వే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే విచారణలో భాగంగా సుబ్బారావును అక్కడి నుంచి నరసరావుపేటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దర్యాప్తు నిమిత్తం అతన్ని నరసరావుపేట పోలీసులకు అప్పజెప్పారు. నిరసనల పేరుతో కేవలం రైల్వేస్టేషన్లను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందనే కోణంలో విచారిస్తున్నట్టు సమాచారం.
ఎన్ని రోజుల నుంచి దీనికి వ్యూహ రచన జరిగింది? దీని వెనక ఇంకెవరు ఉన్నారు? విధ్వంసంలో పాల్గొన్న వారంతా సైనిక నియామకాల కోసం ప్రయత్నిస్తున్నవారేనా? బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంతమంది స్టేషన్ కు చేరుకోవటానికి ఎలా సమాచారం షేర్ చేసుకున్నారు? ఆ ఫోన్లు ఎవరివి? అని సుబ్బారావుకు ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తునట్టు తెలుస్తోంది.