– జూబ్లీహిల్స్ బాలిక కేసులో విచారణ ముమ్మరం
– ఆరుగురు నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు
– నిందితుల ఎస్కేప్ ప్లాన్ ఎవరిది..?
– వీడియో సాక్ష్యాలపై మైనర్లను ప్రశ్నించిన పోలీసులు
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కస్టడీలోకి తీసుకున్న మైనర్లు, సాదుద్దీన్ మాలిక్ ను ప్రశ్నించారు. బాలికను బెంజ్ కారు నుంచి ఇన్నోవాలోకి ఎందుకు మార్చారు? అత్యాచారం చేసిన తర్వాత అరెస్టు వరకు మూడ్రోజులు ఎక్కడ ఉన్నారు..? అనే కూపీ లాగేందుకు ప్రయత్నించారు. కానీ, నిందితులు పోలీసులకు సరిగ్గా సహకరించనట్లు తెలుస్తోంది.
మే 28న జూబ్లీహిల్స్ పబ్ లో బాలికను ట్రాప్ చేసిన నిందితులు పక్కా పథకం ప్రకారం కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 31న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తర్వాత మూడు రోజులపాటు ఆరుగురు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో మొబైల్ నెంబర్ మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. ఇన్నోవా వాహనంలో అత్యాచారం చేసిన సమయంలో ఉన్న ఆధారాలు కొన్నింటిని ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది.
ఇదే ఘటనలో నిందితులైన ముగ్గురు మైనర్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ కోర్టు ఆదేశాల ప్రకారం 5 రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు ప్రత్యేక గదిలో మామూలు దుస్తుల్లోనే పోలీసులు ప్రశ్నించారు. బెంజ్, ఇన్నోవా కార్లలో జరిగిన ఉదంతాన్ని వీడియో తీసింది ఎవరు? సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందెవరు? అనే వివరాలు రాబట్టారు. వీడియోలు, ఫొటోలను ముందుగా ఎవరికి పంపారనే దానిపైనా ఆరా తీశారు. పోలీసులు ప్రశ్నించే సమయంలో నిందితులు నోరుమెదపలేదని సమాచారం.
ఎంక్వైరీ చేసిన ముగ్గురితో పాటు ఈ నేరంలో భాగస్వాములైన మరో ఇద్దరు మైనర్లనూ కస్టడీకి ఇస్తూ జువెనైల్ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఆరుగుర్నీ విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఇద్దరిలో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. మరోవైపు ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ (ఎన్సీపీసీఆర్) తాజాగా నివేదిక కోరింది.
జూబ్లీహిల్స్ లో అఘాయిత్యానికి పాల్పడిన బాలిక మెడికల్ రిపోర్టు పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. బాలిక మెడ చుట్టూ దాదాపు ఏడెనిమిదిచోట్ల పంటిగాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది. లైంగిక దాడికి పాల్పడే క్రమంలో బాలిక ప్రతిఘటించడంతో వారు ఇలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఆయా ఆధారాలకు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సిఉంది.