పిల్లలను షాపింగ్ కి తీసుకొని వెళ్లే తల్లిదండ్రులు.. వారిని కారులో వదిలేసి.. షాపింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఊపిరాడక పిల్లలు మృతి చెందిన ఘటనలు చాలా జరిగాయి. దీంతో, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు పోలీసులు కారులో పిల్లలను విడిచిపెట్టొద్దని తల్లిదండ్రులకు సూచిస్తూ ఉంటారు. అయితే, తాజాగా ఇంగ్లాండ్ లో కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన పోలీసులు 26వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చింది. పాపను కాపాడితే ఫైన్ కట్టడం ఏంటీ అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.
ఇంగ్లండ్‌లోని థార్న్‌బీలో నివసిస్తున్న అమీ మెక్‌క్విలన్, తన 10 ఏళ్ల కుమార్తె డార్సీ షాపింగ్‌కు వెళ్లారు. డార్సీ దగ్గర ఉన్న ఎలియట్ అనే బొమ్మను కారులో వదిలి.. తల్లి, పిల్లలు ఇద్దరూ షాపింగ్ మాల్ లోకి వెళ్లారు. ఆ బొమ్మ చూడటానికి అచ్చం చిన్న పాపలా ఉంటుంది. లోపలకు వెళ్లిన అమీ తన కూతురితో కలిసి తిరిగి వచ్చినప్పుడు కారు చుట్టూ ఎక్కువ మంది గుమిగూడి ఉన్నారు. కారు అద్ధాలు పగిలగొట్టి ఉన్నాయి.
దీంతో కంగారు పడిన అమీ ఏం జరిగిందని అక్కడ ఉన్న పోలీసులను అడగ్గా.. వారు అసలు విషయం చెప్పారు. కారులో చిన్న పిల్ల ఉందని ఎవరో ఇచ్చిన ఫిర్యాదుతో తాము అద్దాలు పగలు గొట్టామని.. కానీ.. లోపల ఉన్నది పాప కాదు.. బొమ్మ అని తరువాత తెలిసిందని చెప్పారు. తన కుమార్తెకు క్రిస్మస్ గిఫ్ట్ గా ఈ బొమ్మను కొన్నామని.. పిల్లల విషయంలో తాను అంత నిర్లక్ష్యంగా ఉండనని అమీ చెప్పారు. దీంతో, జరిగిన తప్పుకు క్షమాపణలు కోరుతూ.. అద్దం పగలగొట్టినందుకు పోలీసులు 26వేలు ఫైన్ కట్టారు.