ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిసోడియాను మంగళవారం రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయన జుడిషియల్ కస్టడీని జూన్ 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆయనను జైలుకు తరలిస్తుండగా జర్నలిస్టులు ఎదురు వచ్చి ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలపై కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య రేగిన వివాదం, దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ గురించి ప్రస్తావించారు.
దీనిపై మీ అభిప్రాయమేమిటని ప్రశ్నించగా .. సిసోడియా మాట్లాడుతూ… ప్రధాని మోడీ అరాచక శక్తిగా మారుతున్నారని, ప్రజాస్వామ్యంపై ఆయనకు విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ఇంకా ఏదో మాట్లాడబోతున్న సమయంలో ఓ పోలీసు అధికారి అడ్డుకుని ఆయన మెడపై చెయ్యి వేసి ముందుకు లాక్కు వెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేజ్రీవాల్ ట్విట్టర్ లో షేర్ చేస్తూ. .ఏ.కె. సింగ్ అనే ఆ పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి సేవలందిస్తూ వచ్చిన సిసోడియా పట్ల అలా దురుసుగా వ్యవహరించే హక్కు పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు.
వారిని ఈ విధంగా ప్రవర్తించాలని కేంద్రం గానీ, వారి పై అధికారులు గానీ ఆదేశించారా అని కూడా అన్నారు. అయితే పోలీసులు తమ చర్యను సమర్థించుకున్నారు. ఓ నిందితుడు మీడియాకు స్టేట్మెంట్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని, అయినా సెక్యూరిటీకోసమే ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందని వారన్నారు.