ఎమ్మార్వో విజయారెడ్డి హత్యపై దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఓ మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్న ఉద్యోగిపై దాడి చేసి హత్య జరిగి 24గంటలు గడిచినా… పోలీసులు అసలు కారణాలను ఇంకా వెల్లడించకపోవటం, ప్రాథమిక దర్యాప్తును కూడా బయటపెట్టకపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తన భార్య హత్యపై సీబీఐ విచారణ జరపాలని విజయారెడ్డి భర్త డిమాండ్ చేశారు. ఇందులో సురేష్ అనే వ్యక్తి కేవలం పాత్రధారి మాత్రమేనని, సూత్రదారులను బయటపెట్టాలని… వారినీ కూడా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా పోలీసుల్లో కానీ, ప్రభుత్వ పెద్దల నుండి కానీ ఎలాంటి చలనం లేకుండా పోయింది.
సహజంగానే ఓ అధికారికి ఆఫీసు గొడవలుంటే… ఆఫీసులో తోటి ఉద్యోగులకు కొంతైనా సమాచారం తెలుస్తుంది. లేదంటే ఇంట్లో భర్తకు ఈ అంశంపై కాస్తో కూస్తో అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. కానీ విచారణ నిమిత్తం ఇప్పటి వరకు పోలీసులు ఆ చర్యలేమీ చేసినట్లు కనపడటం లేదు. విజయారెడ్డి భర్త సుభాష్‌రెడ్డితో పోలీసులు మాట్లాడలేదు. కేవలం తనకు తాను లొంగిపోయిన సురేష్‌ను మాత్రం తమ అదుపులో ఉంచుకున్నారు.
విజయారెడ్డి హత్య వెనుక భూమాఫియా ఉందని, స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్షాల నేతలు సైతం సీబీఐ విచారణ కోరుతున్నారు. భర్త కూడా సీబీఐ విచారణ జరపాలంటున్నారు. అయినా పోలీసుల్లో, విచారణ అధికారుల్లో చలనం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేశంలోనే నెం.1 పోలీసు అని చెప్పుకునే తెలంగాణ పోలీస్ యంత్రాంగం…. ఓ మహిళా ఉద్యోగి అమానుషంగా చంపబడినా… సరైన స్పందన లేదంటే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అని రెవెన్యూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈరోజు విజయారెడ్డి, రేపు ఆ స్థానంలో మేము ఉండొచ్చు… ప్రభుత్వం వెంటనే నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు.