బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. అలాగే.. కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరిచేలా చేసిన స్కిట్ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను అరెస్ట్ చేశారు.
జూన్ 2న.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగోల్ లోని బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో అమరుల యాదిలో పేరుతో బీజేపీ సభను నిర్వహించింది. కేసీఆర్ పాలనను చూసి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటూ, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు అధ్వానంగా ఉందంటూ ఆ సభలో ఓ స్కిట్ ను ప్రదర్శించారు. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కించపరిచేలా, ప్రభుత్వ పథకాల తీరును అవమానపర్చేలా ఉందంటూ టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు చర్యలు చేపట్టారు. రాణి రుద్రమ, ఎల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ కు నోటీసులు జారీ చేశారు.
ఇదే కేసులో 4 రోజుల క్రితం బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. కానీ.. అదేరోజున బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా రాణి రుద్రమ, దరువు ఎల్లన్న అరెస్ట్ అయ్యారు. వీరిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత చర్యలు ఉంటాయని వెల్లడించారు.